శ్రీ సంస్థానంలో గాదీ అష్టమి పండుగకు ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. ఈ పండుగ యొక్క ఇతిహాసం శ్రీ మార్తండ మాణిక్‌ప్రభు జీవితంలోని అత్యంత మహత్తరమైన సంఘటనతో ముడిపడి ఉంది.

1916 వ సంవత్సరంలో శ్రీ ప్రభువు యొక్క మహిమాన్వితమైన  సింహాసనంపై శ్రీ మార్తండ మాణిక్ ప్రభువు ఆసీనులై ఉండిరి. ప్రస్తుతం వారి సమాధి మందిరం ఉన్న ప్రదేశంలోని ఔదుంబర వృక్షఛాయలో ఆ సమయంలో శ్రీజీగారి పూజగది ఉండేది.  ఉత్తరాభిముఖంగా ఉన్న  ఆ గదిలో శ్రీజీగారు ప్రతినిత్యం అనుష్టానం చేసేవారు. శ్రీజీగారు చివరివరకు  క్రమంతప్పకుండా నిత్యపూజ చేసేవారు. తమ జీవితంలోని చివరి క్షణాలలో కూడా శ్రీజీగారు మంచంపై పడుకొనే తమ నిత్యానుష్టానం చేసేవారని చెపుతారు.

నలనామ సంవత్సరం – సోమవారం 7 అగష్టు 1916 – శ్రావణ శుక్ల అష్టమి రోజు మధ్యాహ్నం శ్రీజీగారు తమ పూజగదిలో అనుష్టానం చేస్తున్నారు. సత్పురుషుల పూజా పద్ధతి మన పూజా పద్ధతికి భిన్నంగా ఉంటుంది. శ్రీజీగారు తమ ఒక పదరచనలో ఇలా అన్నారు. “షట్చక్ర అర్చనా పాత్ర సుదీక్షా మంత్ర హర్ష మధుధారా సర్వాత్మ శక్తి లయ శుద్ధ శాంభవీ ముద్రా॥’’ (హే మహా త్రిపురసుందరీ దేవీ నేను నీ అర్చన మధుధార మొదలైన ఆరు ధారలను చక్రరూపమైన పాత్రల ద్వారా చేస్తాను, నా సద్గురువు ద్వారా దీక్ష తీసుకున్న మంత్ర జపంతో కలిగే హర్షాతిరేకంతో మధుధార నా సమస్త శరీరంలో స్రవిస్తుంది. శాంభవీ ముద్రతో నా సమస్త భావాలు మీ సర్వాత్మ శక్తి స్వరూపంలో లీనమవుతాయి.) ఆ సమయంలో ఇలాంటి దైవారాధనలో శ్రీజీగారు నిమగ్నమయ్యారు. పసుపు, కుంకుమ, గంధం, పుష్పం, ధూపం మరియు దీపంతో శ్రీ ప్రభువు ఆరాధన చేసిన తరువాత తమ మనసు-బుద్ధిని నైవేద్యం  రూపంలో సమర్పించి శ్రీజీగారు ఆత్మజ్యోతితో శ్రీ ప్రభువు యొక్క హారతిని ముగించారు. నమస్కారం చేయడానికి శ్రీజీగారు వంగగానే అక్కడ దేదీప్యమానమైన ఒక తేజఃపుజం కనపడింది. గీతలో భగవంతుని విశ్వరూప దర్శనం సంజయుడు ఇలా వర్ణించాడు – “దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుథ్తితా యదీ భా: సద్రుశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః॥’’ (ఒకవేళ ఆకాశంలో వేల సూర్యులు ఒకేసారీ ఉదయించినా కూడా ఆ ప్రకాశం ఈ ప్రభువు యొక్క తేజః పుంజానికి సరితూగదు) ఆ ప్రకాశంతో సాక్షాత్ శ్రీమాణిక్‌ప్రభుమహారాజుగారు సగుణరూపంలో ఏ ప్రదేశంలో అయితే శ్రీజీగారి సమక్షంలో ప్రత్యక్షమయ్యారో ఆ ప్రదేశంలో శ్రావణ శుక్ల అష్టమి రోజు శ్రీ ప్రభువు యొక్క సగుణ సాకారరూప దర్శనమయింది.

శ్రీప్రభువు మరియు శ్రీజీగారి మధ్య జరిగిన సంభాషణ మరియు ప్రభువు ఏ రూపంలో ప్రత్యక్షమయ్యారో మాకు వివరాలు తెలియవు కానీ “ఝాలో అమ్హి బహు ధన్యరే భేటలే సగుణ హే బ్రహ్మరే॥’’  సగుణ బ్రహ్మ దర్శనం వల్ల మేము ధన్యులమయ్యామనే అనుభూతి మాత్రం కలిగిందని తప్పకుండా చెప్పవచ్చు. తమ అనేక రచనలలో శ్రీ ప్రభువు యొక్క  సగుణరూప సాక్షాత్కా రాన్ని శ్రీజీగారు ఎలా వర్ణించారో అవన్నీ కూడా ఈ దివ్యానుభూతితో కూడి ఉన్నాయి.

శ్రీజీగారికి ఏ స్థానంలో శ్రీ ప్రభువు దర్శనమయిందో అక్కడ ఆ రోజే శ్రీ ప్రభువు యొక్క  గాదీ(పీఠం) స్థాపించారు. అందువల్ల శ్రావణ శుక్ల అష్టమిని శ్రీ సంస్థానంలో “గాదీఅష్టమి’’ అంటారు.

ఈ ఘటన తరువాత శ్రీజీగారి శిష్యులు వారితో శ్రీ ప్రభువు యొక్క సగుణ స్వరూప దర్శన అనుభవం యొక్క వర్ణన చేయవలసిందిగా వేడుకున్నప్పుడు శ్రీజీగారు “పూర్ణకృపే కృపా బోలవేనా॥ అనుభవే అనుభవ హీ సాహీనా బోధే బోద జాహలీ కల్పనా మృత్యు పావలీ స్ఫూర్తీ వాసనా॥’’ శ్రీజీగారు తమ శిష్యబృందానికి వివరిస్తూ ఇలా చెప్పారు. నా సద్గురువుకు నాపై పూర్ణకృప కలిగింది మరియు ఆ కృపానుభవాన్ని మాటలతో వ్యక్తపరచడం అసాధ్యం ఎందుకంటే ప్రభువును అనుభవంతోనే తెలుసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే వారే అనుభవరూపులు. అందువల్ల నేను ఆ అనుభవాన్ని వర్ణించలేను. అత్మబోధ యొక్క జ్వాల నా సమస్త కల్పనలను భస్మం చేసింది. ఇప్పుడు నేను ఆ అనుభవాన్ని కల్పన కూడా చేయలేను అందువల్ల నేను మౌనం వహించవలసి వస్తున్నది.

1916వ సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతిసంవత్సరం శ్రావణశుక్ల అష్టమి తిథి రోజు శ్రీ సంస్థానంలో గాదీఅష్టమి పండుగగా జరుపబడుతుంది. ఈ సందర్భంగా శ్రీ మార్తండ మాణిక్‌ప్రభు మహారాజుగారి సమాధికి మహాపూజ మరియు వారిచే స్థాపించబడిన గాదీకి కూడా పూజ చేయబడుతుంది. ఆ పరమ పవిత్రమైన రోజును స్మరిస్తూ మనం ప్రేరితమై ఎల్లప్పుడూ మన అధ్యాత్మిక సాధన దృఢం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కృప కావాలనే అభిలాషతో పూర్ణకృప పొందిన ఈ కథను మనన చేసే సద్భక్తులపై శ్రీ ప్రభువు యొక్క పూర్ణకృప తప్పకుండా కలుగుతుందనడంలో ఆవగింజంత కూడా సందేహం లేదు.

 

[social_warfare]